రాష్ట్ర ప్రభుత్వం 10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP) మోడ్‌లో ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మొత్తం పది కొత్త మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడ్‌లో ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాలేజీలు ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల, పెనుకొండ, పాలకోల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం ప్రాంతాల్లో ఏర్పడనున్నాయి. వీటిలో తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో మెడికల్ కాలేజీల అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. మిగిలిన ఆరు ప్రాంతాల్లో కాలేజీల ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాల పరిశీలన పూర్తయ్యాక నిర్మాణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య విద్య అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించే అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా, ఈ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల వైద్య సిబ్బంది, నర్సులు, ఇతర సాంకేతిక సిబ్బందికి ఉపాధి అవకాశాలు విస్తృతం కానున్నాయి. ప్రజా–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వైద్య రంగంలో రాష్ట్రాన్ని మరింత ముందుకు నడిపేలా ఉండనుంది.