బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని, గుంతలు, దుమ్ము, ట్రాఫిక్ సమస్యలతో జీవించడం కష్టమైందని బ్లాక్ బక్ కంపెనీ సీఈఓ రాజేష్ యాబాజీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన ఇంటి, కంపెనీ 9 ఏళ్లుగా అక్కడే ఉన్నప్పటికీ, రోడ్ల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇక బెంగళూరులో ఉండాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

అలాగే, ఉద్యోగులు ఆఫీసుకి రావడానికి గంటన్నర సమయం పడుతోందని, గత ఐదేళ్లలో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ స్పందించారు. ఆయన రాజేష్‌కు ప్రత్యక్షంగా ఆహ్వానం పలుకుతూ,
👉 "మీ కంపెనీని విశాఖకు తీసుకురావడంలో నాకు ఆసక్తి ఉంది. దేశంలో అత్యుత్తమ క్లిన్ సిటీలలో విశాఖ ఒకటి. మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నాం, మహిళలకు కూడా నగరం చాలా సేఫ్‌గా ఉంటుంది" అని చెప్పారు.

తన అభిప్రాయం డైరెక్ట్ మెసేజ్ రూపంలో చెప్పాలని కోరారు.

దీంతో రాజేష్ పోస్ట్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఒకప్పటి "టెక్ సిటీ"గా పేరు పొందిన బెంగళూరులో ఇప్పుడు రోడ్లు, ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇటీవలి భారీ వర్షాలతో రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది.

అంతేకాక, నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే ప్రతిష్టాత్మక **"భాగస్వామ్య సదస్సు - 2025"**కు ప్రపంచ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు లండన్‌లో జరిగిన "ఆంధ్రప్రదేశ్ - యూకే బిజినెస్ ఫోరం" రోడ్‌షోలో లోకేష్ పాల్గొంటున్నారు.