విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం "జై దుర్గా… జై జై దుర్గా" నామస్మరణతో మారుమోగుతోంది.

భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసి, క్యూలైన్‌లు ఏర్పాటు చేశారు. వాలంటీర్లు, పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో భక్తులకు సౌకర్యవంతంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. తొమ్మిదో రోజు దుర్గాదేవి దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు రావచ్చని దేవస్థానం అంచనా వేసింది.