కేంద్ర ప్రభుత్వం యేటా నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) కింద పేదింటి విద్యార్ధులకు ఉపకారవేతనాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ చదివే పేదింటి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ అందించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8వ తరగతి తర్వాత విద్యార్థుల డ్రాప్‌ఔట్ కాకుండా వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కాలర్‌షిప్‌లను కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రకటనను ఆంధ్రపదేశ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ (ఏపీ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) విభాగం విడుదల చేసింది. అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 30, 2025వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ (NMMSS)కు నిర్వహించే పరీక్షలో ప్రతిభకనబరచిన వారికి స్కాలర్‌షిప్ లభిస్తుంది. యేటా ఈ స్కాలర్‌షిప్‌ను దేశ వ్యాప్తంగా మొత్తం లక్ష మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో 4,087 స్కాలర్‌షిప్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడం జరిగింది.

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ 2025-26 దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తప్పనిసరిగా.. ప్రభుత్వ లేదా స్థానిక సంస్థలు లేదా మున్సిపల్ లేదా ఎయిడెడ్ పాఠశాలలు లేదా మోడల్ పాఠశాలల్లో రెగ్యులర్‌ విధానంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 8వ తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. అలాగే ఏడో తరగతిలో 55 శాతం మార్కులు పొంది ఉండాలి. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతిలోనూ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు. ఎంపిక పరీక్షలో మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ నిబంధనల మేరకు విద్యార్ధులను ఎంపిక చేస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్ధులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అందిస్తారు.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు మాత్రమే పంపించాలి. అనంతరం ఆ దరఖాస్తుల ప్రింటవుట్లతోపాటు ధ్రువీకరణ పత్రాలను డీఈవోలకు అందజేయాలి. దరఖాస్తు సమయంలో బీసీ, ఓసీ విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చొప్పున చెల్లించాలి. ఆధార్‌ కార్డులో ఉన్న విధంగానే విద్యార్ధుల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది