ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రైతు పేదల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రజానాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఇకపై ప్రతి సంవత్సరం ఆగస్టు 16న ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ విభాగాలకు మరియు జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి ప్రతి జిల్లాలో అధికారుల సమక్షంలో ఆయన జయంతి వేడుకలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, సామాజిక సంస్థలు పాల్గొని ఆయన సేవలను స్మరించనున్నారు.

స్వాతంత్ర్యం అనంతరం రైతు సంక్షేమం కోసం నిస్వార్థంగా కృషి చేసిన గౌతు లచ్చన్న గారి ఆలోచనలు, త్యాగాలు, సేవలు కొత్త తరాలకు తెలిసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా యువత ఆయన ఆలోచనలను తెలుసుకొని సమాజ నిర్మాణంలో ముందుకు సాగాలని ఉద్దేశ్యంతో అధికారికంగా ఈ జయంతి వేడుకలను నిర్వహించనుంది.

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుంచుకోవడం, ప్రజలకు చేరవేయడం ప్రభుత్వ బాధ్యత అని, ఆ దిశగా లచ్చన్న జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.