సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అంటే అధిక జీతం, ఐదు రోజుల పని, సౌకర్యవంతమైన జీవితం అని చాలా మందికి అనిపిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూసి చాలామంది భయపడుతున్నారు. ఐటీ రంగంపై ఉద్యోగాల కోత (Layoffs) మేఘాలు కమ్మేస్తున్నాయి.
ఐటీ రంగంపై లేఆఫ్ మేఘాలు
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి. లక్షలాది మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ప్రభావం భారత్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల టీసీఎస్ తీసుకున్న తొలగింపు నిర్ణయం ఈ భయాలను మరింత పెంచింది.
పరిశ్రమ అంచనాల ప్రకారం రాబోయే 2-3 ఏళ్లలో భారత్‌లో సుమారు 5 లక్షల ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.
ఎవరు ఎక్కువ ముప్పులో..?
స్టాఫింగ్ డేటా ప్రకారం 13-25 సంవత్సరాల అనుభవం ఉన్న 4.3 లక్షల మందికి ఉద్యోగ భద్రత తగ్గే ప్రమాదం ఉంది. అలాగే, 4-12 సంవత్సరాల అనుభవం కలిగిన మధ్య స్థాయి ఉద్యోగులు తొలగింపులలో 70% వరకు ప్రభావితమవుతారని అంచనా.
ఇటీవల టీసీఎస్ 12,200 మంది మిడిల్, సీనియర్ మేనేజ్‌మెంట్ ఉద్యోగులను తొలగించడం ఈ ఆందోళనను మరింత పెంచింది.
ఉద్యోగాల కోతకు ప్రధాన కారణాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ ప్రభావం
ప్రాథమిక కోడింగ్, సాఫ్ట్‌వేర్ టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్ పనులను ఇప్పుడు AI సులభంగా పూర్తి చేయగలగడం
సాంకేతిక నైపుణ్యం లేని మేనేజర్లు, టెస్టర్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిబ్బంది తొలగింపులలో మొదటగా ఉండే అవకాశం
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
భారత జీడీపీలో ఐటీ రంగం 7% కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. ఈ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పించడం మాత్రమే కాకుండా, గృహాలు, కార్లు, పర్యాటకం, విలాస వస్తువులపై డిమాండ్‌ను పెంచుతుంది. ఉద్యోగాలు తగ్గితే వినియోగ ఖర్చులు పడిపోవడంతో పాటు ఆర్థిక వృద్ధి బలహీన పడే ప్రమాదం ఉంది.
ఈ పరిస్థితిలో ఐటీ నిపుణులు చేయాల్సింది
గతంలో సాంకేతిక మార్పులు ప్రధానంగా సంస్థలను ప్రభావితం చేసేవి. కానీ ఇప్పుడు ఏఐ యుగంలో వ్యక్తిగత నైపుణ్యాలే కీలకం.
కొత్త డిజిటల్, ఏఐ స్కిల్స్ నేర్చుకోవాలి
మారుతున్న మార్కెట్ అవసరాలకు తగ్గట్లు అప్డేట్ అవ్వాలి
ఆటోమేషన్ వల్ల వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రత్యేక నైపుణ్యాలు సాధించాలి
టెక్ మహీంద్రా మాజీ సీఈవో సీపీ గుర్నాని కూడా “ఆటోమేషన్ వ్యాపారాల కేంద్రబిందువుగా మారుతుంది, కాబట్టి నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం తప్పనిసరి” అని హెచ్చరించారు.