చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో మద్యం కేసు దర్యాప్తు వేగం పెరిగింది. సిట్ బృందాలు వరుసగా సోదాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి చెందిన పలు సంస్థల్లో తనిఖీలు జరిపాయి. చిత్తూరులో మోహిత్‌రెడ్డి ఇన్ఫ్రా కంపెనీతో పాటు బీవీరెడ్డి కాలనీ, నలందానగర్, నిఖిలానంద భవనాల్లో సోదాలు చేపట్టగా, గచ్చిబౌలిలోని మోహిత్‌రెడ్డి కంపెనీలోనూ పరిశీలనలు జరిగాయి.

ఈ తనిఖీల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రికార్డుల్లో ఒక పేరు.. కార్యాలయ బోర్డులపై మరొక పేరు ఉండటంతో డొల్ల కంపెనీల లింకులు బహిర్గతమవుతున్నాయి. చిత్తూరు సీఎంఆర్ కంపెనీ వద్ద వెల్‌టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ బోర్డు కనిపించగా, ఆ సంస్థ వైసీపీ నేత విజయానంద్‌రెడ్డిదని గుర్తించారు. అదేవిధంగా మోహిత్‌రెడ్డి కంపెనీ, విజయానంద్‌రెడ్డి కంపెనీ మధ్య సంబంధాలు బయటపడ్డాయి.

హైదరాబాద్ ప్రశాంతి హిల్స్‌లోని భీమ్ స్పేస్ ఆఫీస్ వద్ద ఇషా ఇన్ఫ్రా పేరుతో బోర్డు ఉండగా, డైరెక్టర్లుగా సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న ఉన్నట్లు గుర్తించారు. ఎన్నికల్లో పట్టుబడిన రూ.8 కోట్లు తనవేనని ప్రద్యుమ్న ప్రకటించుకున్న విషయం ఇప్పటికే పెద్ద చర్చనీయాంశమైంది. సిట్ వరుస సోదాలు కొనసాగుతుండటంతో మద్యం కేసులో నూతన లింకులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.