తెలుగు న్యూస్ అడ్డా | విశాఖపట్నం
భారతదేశంలో డిజిటల్ విప్లవానికి మరో కొత్త మైలురాయి చేరువలో ఉంది. ప్రపంచంలో అగ్రగామి టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో అత్యంత భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక ప్రణాళికలు పూర్తయ్యాయి. రాబోయే ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న డేటా సెంటర్ల కంటే ఎక్కువ సామర్థ్యం
ప్రస్తుతం భారతదేశంలో గూగుల్ సహా పలు సంస్థలకు డేటా సెంటర్లు ఉన్నాయి. కానీ విశాఖపట్నంలో నిర్మించబోయే ఈ సెంటర్, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం డేటా నిల్వ సామర్థ్యాన్ని మించి ఉండనుంది. అంటే, ఒక్క విశాఖపట్నం నుంచే గూగుల్ యొక్క డిజిటల్ సర్వీసులకు అత్యధిక స్టోరేజ్, ప్రాసెసింగ్ పవర్ లభించనుంది.
ఏం మారబోతోంది?
వేగవంతమైన సర్వీసులు – క్లౌడ్ కంప్యూటింగ్, గూగుల్ డ్రైవ్, జీమెయిల్, యూట్యూబ్ వంటి సర్వీసులు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయి.
భద్రత పెరుగుతుంది – డేటా లోకల్‌గా నిల్వ కావడం వల్ల సైబర్ భద్రతా పరంగా మరింత రక్షణ లభిస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణ – విశాఖ డేటా సెంటర్ ద్వారా AI, మిషన్ లెర్నింగ్ ప్రాజెక్టులు మరింత శక్తివంతంగా పనిచేస్తాయి.
డిజిటల్ ఎకానమీ బూస్ట్ – ఫిన్‌టెక్, స్టార్టప్‌లు, ఈ-కామర్స్, ఎడ్టెక్ రంగాలకు నూతన అవకాశాలు లభిస్తాయి.
స్థానిక స్థాయిలో లాభాలు
ఈ డేటా సెంటర్‌తో వేలాది ఉద్యోగాలు సృష్టి కాబోతున్నాయి. నిర్మాణ దశలోనూ, ఆపరేషన్ తర్వాత కూడా విశాఖపట్నానికి ఐటి, టెక్నాలజీ రంగాల్లో వృద్ధి అవకాశం ఉంది. డేటా సెంటర్‌తో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా విస్తరించే అవకాశం ఉంది.
విశాఖ డిజిటల్ హబ్‌గా
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఐటి పరిశ్రమ అభివృద్ధి దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ సందర్భంలో గూగుల్ ప్రాజెక్ట్ ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. విశాఖపట్నం, హైదరాబాద్ తర్వాత దక్షిణ భారతదేశంలో మరో కీలక డిజిటల్ హబ్‌గా ఎదగనుంది.