దృష్టిలోపం దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకులు లేకుండా, వారికి మిగతా విద్యార్థులతో సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో, 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదివే అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ జీఓ నంబర్ 278 విడుదల చేసింది.

సైన్స్ కోర్సుల్లో కూడా చదువుకునే అవకాశం ఇవ్వాలని దృష్టిలోపం గల విద్యార్థులు మంత్రి లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. వారి మనోభావాలను గౌరవించిన లోకేష్, విద్యాశాఖ అధికారులను తక్షణమే ఆ అంశంపై సమీక్ష చేయాలని ఆదేశించారు. ప్రాక్టికల్స్‌లో పాల్గొనడం వారికి సాధ్యం కాదని అధికారులు తెలిపిన నేపథ్యంలో, వారికి ప్రత్యామ్నాయంగా లఘురూప ప్రశ్నల ఆధారంగా ఎసెస్‌మెంట్ నిర్వహించాలని మంత్రి సూచించారు. దీనిని అనుసరించి విధివిధానాలతో జీఓ విడుదలైంది.

దివ్యాంగ విద్యార్థులకు సైన్స్ కోర్సుల్లో అవకాశం కల్పించడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఐఐటీల్లో ప్రవేశానికి దివ్యాంగులకు సమస్యలు తలెత్తినపుడు కూడా మంత్రి లోకేష్ ప్రత్యేక జీఓ ద్వారా పరిష్కారం చూపిన విషయం గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల దృష్టిలోపం గల విద్యార్థులు మంత్రి లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.